యాపిల్ ఫోన్ ని వణికిస్తున్న 'జ్ఞా' ,ఫేస్ బుక్ కీ ఇదే సమస్య

updated: February 17, 2018 13:22 IST

వినటానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక అక్షరం..అదీ తెలుగు అక్షరం...యాపిల్ ఫోన్స్ ఉన్న వాళ్లని భయపెడుతోంది.  గత కొద్ది రోజులుగా  ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన కొన్ని వెర్షన్లలో తలెత్తిన బగ్ కారణంగా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లాంటి ఆపిల్ డివైజ్‌లు క్రాష్ అవుతున్నాయి. దీంతో ఆపిల్ కు చెందిన నిపుణులు ఇన్విస్టిగేషన్ కు దిగారు.  మెసేజింగ్ యాప్స్‌లో నెటిజెన్స్ చేసే చాటింగ్స్, కామెంట్స్ రూపంలోనే ఏదో తెలియని మిస్టరీ అక్షరం ఒకటి ఐఫోన్లు స్తంభించిపోవడానికి కారణమని కనుక్కొన్నారు.  ఆ కారణం కనుక్కున్న పరిశోధకులకి ఆ అక్షరం ఏంటో తెలిసి ఖంగు తిన్నారు. ఎందుకంటే ఆ అక్షరం ఇంకేదో కాదు.. అచ్చ తెలుగు అక్షరం 'జ్ఞా'.

 

‘జ్ఞా’ అనే అక్షరాన్ని ఐఫోన్లకు పంపినా లేదా టెక్స్ట్ ఎడిటర్‌లో ఎంటర్ చేసినా అది క్రాష్ అవుతున్నట్లు గురించారు. ఐఓఎస్ 11, మ్యాక్ ఓఎస్ హై సియెర్రా, వాచ్ ఓఎస్ 4, టీవీ ఓఎస్ 11ల్లో తలెత్తిన బగ్‌ను ఫిక్స్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది.  అయితే ఇక్కడ మరో విషయం ఉంది. పాత వెర్షన్లలో ఈ సమస్య లేదని, ప్రస్తుత ఓఎస్‌లోని బీటా ఆపరేషన్ సిస్టమ్‌లో నే ఈ సమస్య వస్తోందని ఈ బగ్‌ను ఫిక్స్ చేశామని కంపెనీ తెలిపింది.  

 

 ఈ 'జ్ఞా' అనే అక్షరం యాపిల్ ఉత్పత్తులని పెట్టిన ఇబ్బంది చూసిన ఫేస్‌బుక్ కూడా వెంటనే అప్రమత్తమైంది! అందుకే యూజర్స్ చేసే పోస్టుల్లో ఫేస్‌బుక్ కూడా 'జ్ఞా' అనే అక్షరాన్ని అనుమతించడం లేదు. కావాలంటే మీరూ ప్రయత్నించి చేయండి.  

comments